Wednesday, January 30, 2013

మనస్సు – కొన్ని విశేషాలు -1


మనస్సు అంటే ఏమిటి? అదెలా ఏర్పడింది?
మానవుడంటే శరీరము, మనస్సు , ఆత్మల కలయిక. శరీరం పనిచేయడానికి మనసు జ్ఞానాన్ని కల్గిస్తుంటే , ఆత్మ మార్పులేని ‘సత్’ పదార్ధంగా వీటిని నడిపిస్తుంటుంది.
“భూమిరాపో 2 నలో  వాయుః  ఖం  మనో బుధ్ధి రేవ చ
అహంకార  ఇతీయం  మే  భిన్నా ప్రకృతి రష్టధా “  (భగవద్గీత 7-4).
పృథ్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుధ్ధి, అహంకారము అనే భగవంతుని అష్టప్రకృతులలో మనస్సు ఒకటిగా చెప్పబడింది. బ్రహ్మమే తన సంకల్పశక్తిచేత ప్రకృతినుండి పురుషుడు / హిరణ్యగర్భుడు ఆవిర్భవింప చేసాడు. అంటే ప్రకృతి నుంచి హిరణ్యగర్భుడు ఆవిర్భవించాడు. ఈ హిరణ్యగర్భుడి నుంచే సమిష్టి రూపమైన మనస్సు , దానినుండి పంచభూతములు, వాటినుండి జగత్తు ఏర్పడినట్లుగా చెప్పబడింది.

హిరణ్యగర్భుడినే  కార్యబ్రహ్మ లేక కార్యసంభూతి అంటారు. ఇతడే మనస్సునకు మూలం. మనస్సు సూక్ష్మమైనది. జగత్తులో ఉండే అన్ని జీవరాసుల మనస్సులూ కలపబడి/ అనుసంధానం చెయ్యబడిన హిరణ్యగర్భుడే  ఈ మనస్సుల సమిష్టిగా చెప్పబడినది. ప్రాణులన్నిటి యందూ ఉండే సూత్రాత్మ కూడ హిరణ్యగర్భుడే. అంటే ప్రతీ జీవికీ ప్రత్యేకమైన ప్రాణము, మనస్సూ కలిగియున్నా, వీటన్నిటినీ కలిపి ఉంచే చైతన్యమే హిరణ్యగర్భుడు.

వేదాంతపంచదశిలో – తమోగుణప్రధానమైన ప్రకృతి నుంచి పంచభూతములు ఏర్పడ్డాయని, ఈ సూక్ష్మపంచమహా భూతముల ఒక్కో సత్వాంశము నుండి ఒక్కో జ్ఞానేంద్రియం చొప్పున పంచజ్ఞానేంద్రియములు ఏర్పడినాయి. ఈ పంచభూతాల సత్వాంశాలు ఐదూ కలసి అంతఃకరణం ఏర్పడిందని చెప్పబడినది. చేసే వృత్తిభేదాన్ననుసరించి అదా, ఇదా అని సంశయించి విమర్శించే భాగాన్ని మనస్సనీ, వివేచనచేసి ఈ కారణంచేత ఇది ఫలానా విషయమని నిశ్చయించే భాగాన్ని బుధ్ధి అని చెప్పబడింది.
  
సాంఖ్యుల సిద్ధాంతం ప్రకారం అవ్యక్తం నుంచి ముందుగా ఏర్పడిన ‘మహత్తు’ సమిష్టి మనస్సుగా చెప్పబడింది. ఇలా మనస్సు ప్రకృతిపైన , ప్రకృతి బ్రహ్మము పైన ఆధారపడి ఉన్నాయి. మహత్తు నుండి అహంకారం పుట్టగా, అహంకారం యొక్క సాత్విక భాగం నుంచి మనస్సు , రాజసిక భాగం నుంచి ప్రాణము, తామసిక భాగం నుంచి పంచతన్మాత్రలు, వీటినుండి పంచమహాభూతములు, ఈ పంచ భూతముల నుండి స్థూల ప్రపంచమూ కలిగాయని చెబుతారు. ఇలా అహంకారం నుండి ఏర్పడిన మనస్సు ఎపుడూ ఏదొక స్థూలవస్తువుతో సంబంధపడి గుర్తింపును కలిగి ఉంటుంది. ఆ గుర్తింపే ‘నేను’ అనే దానిగా  చెప్పబడుతూ, ఆ నేనే మనస్సనే మహావృక్షానికి బీజమవుతుందని చెప్పబడింది. దేనితోనూ సంబంధపడకుండా మనస్సుకు వేరే ఉనికి లేదు.

మనస్సు అంటేనే ఆలోచనల సమూహం. మనస్సులో ఉండే ఆలోచనలను బట్టే మానవుడు ప్రవర్తిస్తుంటాడు. అంచేతనే “యద్భావం తద్భవతి” అని చెబుతారు. అంతఃకరణమనే పదాన్ని మనస్సనే అర్ధంలో వాడుకలో ఉంది. అంతఃకరణ చతుష్టయం అన్నపుడు మనస్సు, బుద్ధితోబాటుగా అహంకారము, చిత్తము అనేవి కూడ కలసి ఉంటాయి. ఇలా వృత్తి భేదాన్నిబట్టి వేర్వేరుగా పిలువబడుతున్నాయి. ఒకేవ్యక్తి కుటుంబంలో కుమారుదిగాను,తండ్రిగాను, తాతగాను, భర్తగాను, మరియూ వృత్తిపరంగా న్యాయవాది మొదలైన విభిన్న పాత్రలను పోషిస్తూ వివిధ నామములతో పిలువబడుతున్నట్లుగా సంకల్ప వికల్పములను కలిగించేటపుడు మనస్సని చెప్పబడుతోంది. సంకల్పం అంటే ఆలోచనలే. వికల్పమంటే సంశయం . మనస్సు అదా? ఇదా? అనే సంశయాన్ని కల్గించి విమర్శించే భాగంగా చెప్పబడింది.

వివేకంతో ఈ కారణంచేత ఇది ఫలానా అని నిశ్చయించే భాగాన్ని బుధ్ధి అంటారు. అంటే బుధ్ధి నిర్ణయాత్మకమైనది. నేను నాది అని గుర్తింపుతో ఉండేది అహంకారమని చెప్పబడింది. ఇక చిత్తము అనేది సంస్కారాల మూట. దీన్లో అనుభవాలు, ఆలోచనలు భద్రపరచబడి, అవసరమైనపుడు తిరిగి వ్యక్తమై గుర్తుకు వస్తుంటాయి. మనస్సు పనిచేసేటపుడు బుధ్ధి అహంకారములు కూడ మనస్సుతోబాటు పనిచేస్తుంటాయి. బుధ్ధి నిశ్చయించిన విషయాన్ని కర్మేంద్రియాలద్వారా ఆచరణలో పెట్టేటపుడు మనస్సును వ్యాకరణాత్మకమైనదిగా చెప్పబడింది.                                 
   

Friday, January 25, 2013

మాయాస్వరూపము – 7


ఆరోపము  సోపాధికము, నిరుపాధికము అని రెండు విధములు.
త్రాడుపై పాము, ముత్యపు చిప్పపై వెండి అనే ఆరోపములు – నిరుపాధికములు . అంటే ఉపాధి లేనివి. వీటి యందు  జ్ఞాన ఫలితంగా పాము, వెండి అనే భ్రాంతి తొలగిపోడమే గాకుండా ఆయా వస్తువులు కనిపించవు.
సోపాధికములైన ఆరోపములందు ఉపాధి ఉన్నంత వరకూ ఆయా వస్తువులు కనిపిస్తాయి. కాని అవి సత్యమనే బుధ్ధి, భావన నశిస్తాయి. మట్టికుండ , బంగారు ఉంగరం అనేవాటి యందు కుమ్మరి వాని పని, కంసాలి పని ఉపాధులుగా ఉండి ఆవస్తువులు కనిపిస్తూనే ఉంటాయి. కాని జ్ఞానం వల్ల కుండ, ఉంగరము అనే నామరూపాలు సత్యమనే భావం నశించి మట్టి, బంగారము మాత్రమే  సత్యమనే బోధ కల్గుతుంది. 
    
ముముక్షువుకు సస్వరూప సాక్షాత్కారానుభవం కల్గిన పిదప ఈ జగత్తు సత్యమనే భ్రాంతి నశించినా, అది కన్పిస్తూనే ఉంటుంది. ఈ భ్రాంతికి ఆధారమైన బ్రహ్మమే సత్యమని బోధపడినప్పుడు, దానిపై వివర్తమైన జగత్తు కన్పిస్తున్నా అది అసత్యమని బోధపడుతుంది. అపుడు దానియందు సత్యత్వ బుధ్ధి నశిస్తుంది. ఇక్కడ మరో ఉదాహరణను చూద్దాం. నీటి గట్టున నిలబడినపుడు నీటి యందు ప్రతిబింబం తలక్రిందుగా కనిపిస్తుంది. అది నీటి గట్టున నిలబడిన పురుషునిలా ప్రతిబింబం సత్యం కాదు. అలా స్వచ్ఛమైన నీటి యందు ప్రతిబింబం చూసినపుడు అది అక్కడ నిలబడిన పురుషుడే  అనే భ్రాంతి కల్గుతుంది. అంటే ప్రతిబింబం మీద పురుషత్వము సత్యత్వము  ఆరోపించ బడింది. కాని అది ప్రతిబింబం అనే బోధ కలగగానే దాన్లో పురుషత్వమూ, సత్యత్వమనే బోధ నశిస్తుంది. ఐనా ప్రతిబింబం కనిపిస్తూనే ఉంటుంది.

అలాగే జగత్తు సత్యమనే భ్రాంతి నశించినా, అది కనిపిస్తూనే ఉంటుంది. ఈ భ్రాంతికి ఆధారమైన బ్రహ్మము సత్యమని బోధ పడినప్పుడు దానిపై వివర్తమైన జగత్తు కన్పిస్తున్నా అసత్యమని బోధపడటం వల్ల , దానియందు సత్యత్వ బుధ్ధి నశిస్తుంది. అలాంటి బోధ అద్వైతంలో మోక్షాన్ని కలిగిస్తుందని చెప్పబడింది.
అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శ్రీ శంకర భగవత్పాదులు మూడురకాలైన సత్తలను లేక సత్యత్వాలను ప్రతిపాదించారు.

మొదటిది – ప్రాతిభాసిక సత్త :- ఎండ పడటం వల్ల ముత్యపు చిప్ప, గాజు ముక్క ధగ ధగా మెరిసి, వెండి అనో బంగారమనో భ్రాంతి కలుగుతుంది. అదేవిధంగా స్వప్నం చూస్తున్నంత సేపూ అనేక పదార్ధాలు కనబడుతాయి. వాస్తవంలో అవి అక్కడ లేకపోయినా, ఆ సమయంలో కనబడుతున్నాయి కాబట్టి లేవని చెప్పలేం. నిజానికి అవి అక్కడ లేవని, అంటే అది వెండి గాని బంగారం గాని కాదని తర్వాత తెలుస్తుంది. ఇలా భ్రాంతి జ్ఞాన సమయంలో ఆ రజతాదులకున్న సత్తను ప్రాతిభాసికం అంటారు. 

వ్యావహారిక సత్త :- వస్తువునకున్న దూరము, కను చీకటి అనేదోషంచేత త్రాడు మీద సర్పం కనపడి నట్లు , నిద్రాది దోషంచేత స్వాప్నిక జగత్తు కనబడినట్లుగా, అనాదిగా వస్తున్న అజ్ఞానంచేత జీవుడు నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపమైన బ్రహ్మము మీద ఈ జగత్తును , జగత్తు కన్న ఈ బ్రహ్మమునకన్న తనను వేరుగా కల్పించుకొని చూస్తున్నాడు. ఈ అవిద్యకు లోబడి ఉన్నంత సేపూ జగత్తు, తానూ, బ్రహ్మమూ వేర్వేరుగా ఉంటారు. ఇలాగే లోకవ్యవహారం అంతా జరుగుతోంది. ఈ భూమికలో ఇదంతా సత్యమే. ఇదే వ్యవహారిక సత్త.

పారమార్ధిక సత్త :- ఉపనిషద్వాక్యాల శ్రవణ మనన నిదిధ్యాసనల వలన అద్వైత బ్రహ్మం ఒక్కటే సత్యమని, జగత్తు కల్పితమైనది , నేను బ్రహ్మమూ ఒక్కటే నని ఆత్మసాక్షాత్కారం కల్గిన తర్వాత తెలుస్తుంది. అపుడీ జగత్తు, విభేదాలూ అన్నీ లీనమై పోతాయి. అంతా బ్రహ్మము గానే కనిపిస్తుంది. ఇదే పారమార్ధిక సత్యం. ఈ సత్యాన్ని అనుభవంచెందే వరకూ వ్యవహార భూమికలో భేదాలన్నీ ఉంటాయి.

మాయ పరతత్వాన్ని ఆచ్ఛాదించి వాస్తవంలో లేని జగత్తును ఉన్నట్లుగా చూపిస్తుందని చెప్పబడింది. మాయకుండే ఆవరణశక్తిచేత పరమార్ధ తత్వాన్ని కప్పివేయగా, విక్షేపశక్తి చేత లేని ప్రపంచాన్ని ఉన్నట్లుగా చూపిస్తుంది. అంచేత మాయ యొక్క అసలు స్వరూపం తెలుసుకున్నపుడు , అది తనంత తానే తొలగి పోతుంది. రజ్జు స్వరూపం తెలిసిన తర్వాత సర్పం తొలగి పోయినట్లుగా ఆత్మ స్వరూపం తెలిశాకా జగత్తు అదే తొలగి పోతుంది. అప్పుడు మిగిలేది అద్వితీయ ఆత్మతత్వమే. ఇదే మాయా స్వరూపం.      

Thursday, January 17, 2013

మాయాస్వరూపము – 6


ఉపాదానము మూడు విధములు. అవి వివర్తము, పరిణామము , ఆరంభకము.  వీటిలో పరిణామము, ఆరంభకములకు భాగములు ఆవశ్యకం అవుతాయి. అంచేత బ్రహ్మమునకవి అన్వయించవు.

ఆరంభక ఉపాదానకారణ మంటే :- కార్యమునకన్న భిన్నంగా ఉండేది. అంటే ఒక పదార్ధం నుంచి మరోపదార్ధం ఉత్పత్తి అవ్వడం. ఉదాహరణకు- నూలు పోగులనుంచి వస్త్రం తయారవ్వడం వంటిది.

పరిణామ ఉపాదానకారణం :- కారణం యొక్క మరొక స్థితి , కార్యరూపంగా ఉండటం. అంటే కారణం ఒక అవస్థ నుంచి మరొక అవస్థను పొంది కార్యం అవడాన్ని పరిణామము అంటారు.

ఉదాహరణలు –
పాలు పెరుగుగా మారడం  – దీన్లో పూర్వ రూపం నశిస్తుంది. పాలు పెరుగుగా పరిణామం చెందినపుడు ఆధారమైన పాలు ఇక లభించవు.
మట్టి రూపాంతరం చెంది కుండ అవ్వడం, బంగారం ఉంగరం అవ్వడం.  వీటిలో మట్టికుండ, స్వర్ణపు ఉంగరము లందలి  మట్టి, స్వర్ణము నశింపక కావల్సినపుడు లభిస్తాయి. అంటే ఆధారము నశించదు.  కుండ పగిలినపుడు మట్టి కన్పించదు కాని పెంకులు కన్పిస్తాయి. పెంకుల పొడిలో మట్టి ఉంటుంది. ఇది బంగారం విషయంలో స్పష్టంగా కన్పిస్తుంది. బంగారపు ఉంగరం విరిగినా, కరిగినా బంగారమే మిగులుతుంది.
పాలు పెరుగుగా మారినపుడు, పరిణామం చెందటంవల్ల తిరిగి పూర్వరూపాన్ని పొందలేవు. కాని మట్టి మొదలగు వానియందు పరిణామము, వివర్తము కూడ ఉంటాయి.

వివర్త ఉపాదానకారణం అంటే :- కార్యం కారణానికన్నా భిన్నం కాకపోయినా భిన్నంగా కన్పించడం. ఇక్కడ నిజంగా అవస్థలో మార్పు లేకపోయినా ఉన్నట్లుగా భాసించడాన్ని వివర్తము అంటారు. ఉదాహరణకు - త్రాడు పాముగా  కనిపించడం వంటిది.
కనుక అంశములు లేని బ్రహ్మమునందు జగత్తు వివర్తమని చెప్పబడినది. ఇంద్రజాలకుని శక్తివలె ఆ వివర్తమును కల్పించేది మాయాశక్తి. శక్తి శక్తిగలవాని కన్న భిన్నంగా శక్తి లేదు. అంటే శక్తీ, శక్తిమంతుడూ కలిసే ఉంటాయి. అయినా శక్తీ, శక్తిమంతుడూ ఒక్కటి కాదు. అలాగే మాయ భిన్నము, అభిన్నమూ కూడ కానిదగుటచే అనిర్వచనీయమని ప్రతిపాదించ బడినది. 

కార్యమైన కుండ ఏర్పడటానికి పూర్వం ఆశక్తి మట్టియందు నిగూఢమై ఉండేది. కుమ్మరి  కట్టె , చక్రము మొదలైన వాటి సహాయంతో మట్టియే ‘కుండ’ అనే వికారము చెందినది. మట్టినుండి వియోగము కల్గితే అది కన్పించదు  గనుక ఆకుండ మట్టికన్న భిన్నముకాదు . కాని అభిన్నముకూడ కాదు. ఏలననగ  మట్టిముద్ద దశలో  కుండ కన్పించదు గనుక. మట్టిపై పనిచేసి కుండను చేయు శక్తి,  కార్యముకన్నను, ఆశ్రయమగు మట్టికన్నను భిన్నము. గనుక ఆశక్తిని అచింత్యము, అనిర్వచనీయము అని చెప్పబడినది. అందుచేత శక్తిచే కల్పించబడిన ఘటము , దానిని కల్పించు శక్తివలెనే అనిర్వచనీయము. కార్యము వ్యక్తమైనపుడు ఆశక్తికి ఘటమని పేరు. కార్యము వ్యక్తము కానపుడు శక్తి అని అంటాం. ఇలా మాయామయములవడంచేత వికారములన్నీ మిధ్య అనీ , వికారములకు ఆధారమైన మట్టివంటి వస్తువు మాత్రమే  సత్యమని శృతి చెబుతోంది. ( చాన్దోగ్యోపనిషత్తు 6.1.4).

వ్యక్తము, అవ్యక్తము అనేవి పూర్వ, పర కాలభేదం వల్ల మారుతుంటాయి. కాని ఆధారం అనేది సర్వకాలాల్లోనూ ఉంటుంది కాబట్టి అదే సత్యము. మట్టి దాని కార్యం వ్యక్తమవ్వడానికి పూర్వము , తర్వాత కూడ ఒకేరూపముగా ఉంటుంది. దానికి తత్వం ఉండటంవల్ల, నాశనం లేకపోవడం వల్ల అది సత్యమైన వస్తువని చెప్పబడుతుంది.




Thursday, January 10, 2013

మాయాస్వరూపము - 5



ఈ మాయ పరమాత్మ జ్ఞానము తెలిసినవానియందు లేదనియే చెప్ప బడినది. అజ్ఞానికి రజ్జుసర్ప భ్రాంతి 
వలె అజ్ఞానము ఉన్నంత వరకూ సత్యమేనని తోచును. అంచేత అసత్యము కాదు. కనుక సత్తును కాదు, అసత్తును కాదు. ఆదియగు మాయ అవిద్య / అజ్ఞానమని చెప్పబడుట వల్ల బ్రహ్మమని చెప్పలేము. అంచేత మాయా స్వరూపము బ్రహ్మమునకన్న వేరనిగాని , వేరుకాదని గాని నిర్ణయించ శక్యముకాదనిరి. సత్వరజస్తమో గుణముల సామ్యావస్థయే మాయయొక్క స్వరూపము. ఇది కేవలము జడము. మోహాత్మకము. జగత్తుకు ఉపాదాన కారణము. ఉత్పత్తి , స్థితి , లయములు లేని మహామాయ ప్రపంచమునకు వ్యక్తావస్థ కలిగినపుడు ఉత్పత్తి , స్థితి , లయములు గల దానివలె షడ్భావవికారములు లేని  శుద్ధ బ్రహ్మమునకు ఆ వికృతులు కల్గినట్లు భ్రమను కలిగించి బ్రహ్మమును ఆవరించి యున్నది. 

ఈ మాయయే సత్యమైన బ్రహ్మమును అసత్యమనియు , అసత్తగు జగత్తునందు సత్యత్వ భ్రాంతిని కల్పిత దోషములచే అవిద్యను పెంచుటకు ప్రయత్నించును. బ్రహ్మమును ఎరిగిన జ్ఞానికి ఈ మాయ  ఎట్టి వికారములను కలుగ జేయక  అతని వశమై ఉండును. బ్రహ్మజ్ఞానమునకు జగన్మాతయే ఇంద్రియ సంయమనముతో ప్రయత్నించు సాధకునికి సస్వరూప సాక్షాత్కార అనుభవమును పొందించు చున్నది. తానే సమస్తమై, బ్రహ్మమును ఆవరించి యున్న ఈ చిచ్ఛక్తి - తన విక్షేప, ఆవరణశక్తి విశేషమున బ్రహ్మమును మరుగున పడునట్లు చేయుచున్నది. ఈ మూలప్రకృతి యొక్క  చైతన్యసత్తను ఎరిగిన జ్ఞానులు , జగన్మాత అనుగ్రహమునకు పాత్రులై శుద్ధబ్రహ్మమును పొంది బ్రహ్మ స్వరూపులగు చున్నారు. 

జగత్తు ప్రకృతి నుంచి ఏర్పడిందా లేక బ్రహ్మము నుండి ఏర్పడిందా అనేది వేదాంతశాస్త్రంలో విస్తృతంగా చర్చించిన పిదప బ్రహ్మము నుండే నామ రూపాత్మకమైన జగత్తు ఏర్పడిందని చెబుతూ బ్రహ్మమే నిమిత్త , ఉపాదాన కారణాలుగా నిశ్చయించడం జరిగింది. ఇప్పుడు నిమిత్త ఉపాదాన కారణాలంటే ఏమిటో చూద్దాం. వీటిని తెలియజేయడానికి కుండ, కుమ్మరి, మట్టిని తీసుకొని  చాలాచోట్ల దృష్టాంతంగా చెబుతారు. కుండ తయారవడానికి మెత్తని మట్టి లేక మృత్తు కావాలి. ఇక్కడ మట్టిని ఉపాదానకారణం అంటారు. మట్టిని కుండగాచేసే కుమ్మరిని నిమిత్తకారణం అంటారు. కుమ్మరి, కుండ చెయ్యడానికి ఉపయోగించే చక్రము , దండము/కట్టె లను  సహాయకారణం అంటారు. తయారైన కుండను కార్యము అంటారు. ఇక్కడ మట్టి వేరు. కుమ్మరి వేరు. అంటే నిమిత్త ఉపాదాన కారణాలు వేర్వేరుగా ఉన్నాయి. వివేచన చేసి చూస్తే , ప్రతీ వస్తువునకూ నిమిత్త ఉపాదాన కారణాలు వేర్వేరుగా ఉంటాయి. కాని జగద్రచనలో మాత్రం ఈ రెండూ ఒకటిగానే ఉంటాయి.

పరిశీలించి చూస్తే ఇక్కడ మట్టితో చేయబడిన కుండ అంతా మట్టే. అంటే కార్యమైన కుండలో ప్రతీ అణువూ ఉపాదాన కారణమైన మట్టి మాత్రమే. అంటే కారణమైన మట్టి,  కార్యమైన కుండలో ఇమిడి ఉంది. దీన్నే కార్యకారణసంబంధం అంటారు. కుమ్మరియందే కుండ లీనమవ్వడం ఉండదు. కాని మట్టియందే స్థితి లయములనేవి మనం చూడ గలుగుతాం. అలాగే జగత్తుయొక్క స్థితి, లయములు ఉపాదానకారణమైన 
బ్రహ్మము నందే ఉంటాయి.





Thursday, January 3, 2013

మాయాస్వరూపము - 4


మాయకు విక్షేపశక్తి, ఆవరణశక్తి అని రెండు విధములైన శక్తి ఉంది. విక్షేపశక్తి అంటే  లేని వస్తువును  ఉన్నట్లుగా చూపడం. ఆవరణశక్తి అంటే ఉన్న వస్తువును లేదనుకొనేటట్లు చెయ్యడం. ఈ రెండిటివల్ల బ్రహ్మమునందు జగద్భ్రాంతియును, బ్రహ్మము లేదనుట జరుగుతోంది.
   
సత్వగుణ సామ్యమున ప్రకృతి  వ్యక్తమవుచుండగ, అందు బ్రహ్మము సాక్షిచైతన్యముగా ప్రతిబింబించెను. ఇట్టి బ్రహ్మచైతన్యమే విక్షేపశక్తిగా సత్వగుణోద్రేకం పొందిన ఆవరణశక్తితో కూడి అవ్యక్తమని చెప్పబడుతోంది. ఈ శుద్ధ సత్వగుణప్రధానమైన మాయ  చిచ్ఛక్తిగాచెప్పబడుతోంది. ఇదే ఈశ్వరునకు  ఉపాధి. మాయా రూపమగు చిచ్చక్తి , మాయాధిష్టాన చైతన్యము,  మాయా ప్రతిబింబచైతన్యములు కలసినదే- ఈశ్వర చైతన్యము. ఈచైతన్యమే  జగత్కర్తగా  నిమిత్త ఉపాదాన కారణమగుచున్నాడు. నాశరహితమగు బ్రహ్మమును పొందు పరాప్రకృతిచే  విక్షేప, ఆవరణశక్తుల సహాయమున జగద్రచన జరిగెను. ఇందు విక్షేపశక్తి క్షేత్రజ్ఞుడు. ఆవరణశక్తి క్షేత్రము. 

ఈ చిచ్ఛక్తి అంశములైన అస్తి , భాతి , ప్రియము అనేవి క్షేత్రజ్ఞుని విక్షేపశక్తిగాను ,  నామ రూపములను అంశములు జగద్రూపమున క్షేత్రస్వరూపమగు ఆవరణశక్తిగనూ తెలియబడుతోంది. (అస్తి - అంటే ఉనికి కల్గి ఉండటం . అదే సత్తు. భాతి అంటే ప్రకాశము . అదే చిత్తు. ప్రియము అంటే ఆనందము ). అనగా బ్రహ్మచైతన్య రూపిణిగా నున్న పరా ప్రకృతే ఆత్మగాను , ఆమెకన్న భిన్నమైనది అనాత్మగాను చెప్పబడింది. ఆమెయే పరతత్వము. ఈ చిచ్ఛక్తియే క్రియా , ఇచ్ఛా , జ్ఞాన , ఆది , పరాశక్తి రూపములలో చెప్పబడుచున్నది. జగద్రచనను ఇచ్ఛాశక్తిగాను, జగద్రక్షణ జ్ఞానశక్తిగాను , లోకోపసంహారము క్రియాశక్తిగాను , ఈ మూడిటికి అధిష్టానమైనశక్తిని ఆదిశక్తిగాను , నిరధిష్టాన మాయాత్మకమగు పరాశక్తి  సర్వసంకల్పాత్మకమగు శుద్ధచిచ్ఛక్తి గాను చెప్పబడు చున్నది. చిచ్ఛక్తి , బ్రాహ్మీ , మహేశ్వరి , కౌమారి , వైష్ణవి , వారాహీ , ఇంద్రాణి అను సప్తమాతృకలుగా ఈ జగన్మాతయే తెలియబడుచున్నది. రాజరాజేశ్వరి , శ్రీవిద్య , పంచదశాక్షరి , మహాత్రిపురసుందరి , బాలాంబిక , మాతంగి , భువనేశ్వరి , మహాలక్ష్మి , మహాకాళి , మహాసరస్వతి , గాయత్రి , సావిత్రి , బ్రహ్మానందరూపిణి అని మూలమాయ అనేక నామములతో పిలువబడు చున్నది. 

ఈ జగన్మాత లేక మూలమాయ బ్రహ్మమున  ఏకదేశమునందున్నపుడు తనయందు బ్రహ్మము ప్రతిబింబించగ ఆ బ్రహ్మచైతన్యము వల్ల జగత్తును నిర్మాణము చేయుచున్నది. ఇట్లు తనచే సృజించబడిన జగత్తు మాయాకార్య  సంగమము లేని శుద్ధబ్రహ్మమునందు ఆరోపించబడు చున్నది. ఈమెయే అవ్యక్తరూపమున బ్రహ్మమునందు కేవల శక్తిస్వరూపిణి అగు నీళ అనియు , వ్యక్తమగు అన్ని శరీరములందు మూలప్రకృతి రూపమై జ్ఞేయమగు ప్రణవ స్వరూపమనియు చెప్పబడుచున్నది. సర్వ చైతన్య స్వరూపమునకూ, ఆ మూల ప్రకృతియే ఓంకారరూపిణి, చిచ్ఛక్తి. ఈ మూలమాయ  బ్రహ్మమున ఏకదేశమున నున్నపుడు సత్వరజస్తమోగుణ సామ్యమున ఉండును. ఇదే శుద్ధసత్వ ప్రధానమైనచో మాయ అనియు, మలినసత్వ ప్రధానమైనచో అవిద్య అనియు ఈశ్వర , జీవ భేదములు తెలియబడు చున్నవి. 

మూలమాయ బ్రహ్మచైతన్యశక్తియై  నారాయణి , వైష్ణవి , దేవి , త్రిగుణాత్మిక , ప్రకృతి అని చెప్పబడుతోంది. ఈ శక్తియే పరాప్రకృతి , అపరా ప్రకృతి అని రెండు విధములు. ఇందు ఇరువదినాలుగు తత్వములతో కూడినది ( పంచమహా భూతములు, దశేంద్రియములు, పంచ తన్మాత్రలు, మనస్సు, బుధ్ధి, అహంకారము , అవ్యక్తము ) అపరాప్రకృతి. ఇది దైవి, ఆసురి అని రెండు విధములు. ఇందు దైవి- శుద్ధసత్వప్రధానమై విద్యామాయ అనబడును. అసురియే- అవిద్య. బ్రహ్మచైతన్యమే మాయాసంబంధమున ఈశ్వరుడనియు , అవిద్యా సంబంధమున జీవుడనియు చెప్పబడు చున్నది. ఇట్లు అపరా ప్రకృతి / అవిద్య/ క్షరము/ క్షేత్రము / పదము అని చెప్పబడు ఈ ప్రకృతిశక్తియే   పరమాత్మ సన్నిధానమును పొందినదై , బ్రహ్మము ప్రకృతుల ప్రతిబింబములు ఒక దానియందు మరొకటి కలియుటచే అభిన్నత్వము చెంది ఆ ప్రకృతియే పరాప్రకృతి అనియు విద్య/ అక్షరము / క్షేత్రజ్ఞుడు / సత్తు/ పురుషుడు అని పిలువబడు చున్నది.  ఇట్లు మూలమాయ క్షేత్ర, క్షేత్రజ్ఞ విభాగములచే అపర, పరాప్రకృతి అని తెలియ బడుచున్నది. ఈ మూలమాయాశక్తి ఉందని గాని , లేదనిగాని నిర్ధారించ లేమని చెప్పబడింది.