Tuesday, December 17, 2013

జ్ఞానయోగము- సాధన (20)

సస్వరూప అనేదానికి అర్ధం ఒక దానియొక్క సహజరూపం అని. అంటే మాయతో కలియని సహజమైన సత్యమైనది ఆత్మ. జీవుడంటే మాయతో కూడినట్లుగా చెప్పుకోవాలి. రూపం అంటే మనస్సు. ఈ పదం ఎక్కడ వాడినా ఆ వస్తువు జీవంతో ఉన్నట్లుగా భావించాలి. అంటే అట్టి జీవంతో కూడిన దానితో అనుసంధానం చెయ్యాలని చెబుతారు. ఇలా భక్తితో అనుసంధానం చేసిన ముముక్షువుకు గురువే అతనిలో ఉన్న వివేక వైరాగ్యాలు, శమాదిషట్క సంపత్తినీ చూసి, సన్యాసస్వీకారం మహావాక్యోపదేశమూ ఉంటాయి. అదే శ్రవణం. యిదివరలో ఆత్మజ్ఞానం కోసం సన్యాసాన్ని అర్హతగా చెప్పగా, ఇప్పుడు జ్ఞానం కలిగాక సన్యాసమని చెప్పబడుతోంది.  భక్తిలో పరిణతి చెందినప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించి, భక్తితో అహంకారాన్ని క్రమంగా లీనంచేస్తూ ఉండగా శ్రవణ మనన నిదిధ్యాసనాలను చేస్తాడు.
ఇంతదాకా బుద్దివల్ల తాను విన్నదీ , చదివినదీ ఒంటబట్టించుకొని, కోరికలన్నిటినీ త్యజించి సన్యాసి అవుతాడు. కర్మలన్నీ జ్ఞానంతో పరిసమాప్తి అవుతాయి. ఇక శ్రవణ మనన నిదిధ్యాసలన్నమాట.

శ్రవణం
అంటే గురువు నుండి మహావాక్యోపదేశాన్ని వినడం శ్రుతిలోనికి వస్తుంది. ఇదేగాక, గురుసాంప్రదాయం గురించీ, జీవ బ్రహ్మములను ఐక్యం చేసే పద్ధతులను గురించీ కూడా గురువు చెప్పవచ్చు. ఇదంతా శ్రవణం లోకే వస్తుంది. ఇచ్చట గమనించ వలసిందేమంటే, పూర్వాశ్రమంలో గురువూ, ఇప్పటి గురువూ ఒక్కరే కావచ్చు లేదా వేర్వేరుగాను ఉండవచ్చు.

తత్వమసి మొదలైన మహావాక్యాల అర్ధం తెలుసుకోవడం శ్రవణమని చెబుతారు. తనంత తాను శాస్త్రాలనుండి పఠనం వల్ల నేర్చినదీ జడంగానే ఉంటుంది. కాని ఆ విషయాలే గురుముఖతా ఉపదేశరూపంలో వచ్చినప్పుడు సజీవంగా అవుతుంది. గురువుకన్న తాను తక్కువవాడిననే భావనవల్ల  అహంకార  నిర్మూలన , వినయమూ, విధేయత కలుగుతాయి. అప్పుడు గురువు చెప్పినదాన్ని ఆచరణలో పెట్టడం, గౌరవంతో కూడిన వినయము ఏర్పడి గురుసేవ చెయ్యడానికి బుద్ధిని పుట్టిస్తుంది. అలాంటి సేవనే శుశ్రూష అంటారు. గురువు సాక్షాత్ భగవంతుడే అనే భావనవల్ల గురువు అనుగ్రహం కల్గి, సాధకుడిని గమ్యం చేర్చుతుంది.

మననం
సన్యాసి గురూపదేశం పొంది, అద్వైత బ్రహ్మభావనపైనే లక్ష్యం ఉంచాలి. శ్రవణంలో తెలుసుకున్న అర్ధాన్ని విచారణతో ఇదే సరైనదని నిర్ధారించుకోవడం మననం అనబడుతోంది.
లోకంలో ఏ విషయం మీదైనా నిర్ణయానికి రావలసినప్పుడు యుక్తిని ఉపయోగిస్తాం. శ్రద్దాభక్తులున్న మనో బుద్దులతో, ఒక విషయాన్ని విశ్లేషించడం యుక్తి అనబడుతోంది. యుక్తి అనుభవంతో గాని, హేతువాదంతో గాని చేసే తర్కం కాదు. విచారించడం వల్ల మనస్సుతో కలిగే అనుభవం అనవచ్చు. అట్టి యుక్తివల్ల అహంకారం నిర్మూలనమై మనస్సు శుభ్రం చెయ్యబడుతుంది. శాస్త్రీయమైన సత్యం, వివేకంతో కూడినప్పుడు, మనస్సుకు విశ్రాంతి కలుగుతుంది. శాంతం యొక్క తటస్థస్థితిని సాత్వికమని చెబుతారు. ఈ దశలో సాధకుడి అనుభవం అంతరాత్మతో సంబంధించి ఉంటుంది. ఉపదేశాన్ని నిత్యమూ మననం చేయడం వల్ల మనస్సు చలించదు. అవిద్యనుంచి బయట పడేదాకా ధ్యానాన్నీ, మననాన్నీ అదే భావనతో కొనసాగించాలి. మననం చేస్తుండగా ఆత్మను గురించిన అనేక భావాలకు పరిష్కారం లభిస్తుంది. అపుడది నిదిధ్యాసనకు దారి తీస్తుంది.




No comments:

Post a Comment